Thursday, 21 February 2008

అన్నదాత

ఆకలెరుగదు సృష్టి అసలీ కష్ట జీవే ఉండు వరకు
అ కలి శపియించెనేమో కూడు లేదీ కర్షకునకు
పుడమి తల్లికి పుట్టలేదో?ప్రేమ నీ పై చూపదో?
పడిన కష్టం పరులకే, పస్తు మాత్రం మిగిలెనో?
సన్నగిల్లి, సొమ్మసిల్లి నీ చెమటనే చిందిస్తివో?
మండుటెండన మట్టి తడిపి మెతుకునే పుట్టిస్తివో?
నలుగురాకలిని తీర్చ నాగలిని నువ్ చేపడితివో?
విధి జాలమో,విపరీతమో అదే గుండెపై శూలమో?
పోని ఈ కలి గాలినీ,పోనివ్వనీ పెను గాలినీ !
రాని ఆ చిరుగాలినీ,నీ సేద తీర్చే సంజ్ఞని !!
నేల తల్లి మొరలు నల్ల మబ్బును కదిలించునులే !
ఉరిమి,మెరిసి మేఘమాల ఊరట కురిపించునులే !!
ఆకసము మొదలీ అవని వరకా వాన వంతెన వేయులే !
ఝారా ఝారా సిరి హరిత సరితై చేరి ఇలను వరించులే !!
శుభములే చేకూరులే,సుఖ ఘడియలే సిద్ధించులే !
రైతే రారాజను నినాదం దిగ్దిగంతముల మ్రోగులే !!

Tuesday, 19 February 2008

భరోస

సాగిపోరా ఏరు లాగా సాధించనిదింకేముంది?
తీరమున్నది దూరమైనా ధైర్యమన్నది నీకుంది
దూసుకెళ్ళు దారిలోన రాతి దెబ్బలు తగిలినా
దూకివెళ్ళు ఎత్తు పల్లాలెన్ని ఎదురుగ నిలిచినా
కార్యదీక్షలో కంట నీరైనా కంఠ దాహాన్ని తీర్చలేదా?
కదన రంగాన నువ్వు రాల్చే రుధిరమే సింధూరమవదా?
నిజాయితీ,నిస్వార్థత లను నమ్మి నువ్వు చూడు
నింగి,నేల,నిప్పు,గాలులు నిలుస్తాయి నీ తోడు
ఊహకి తెలియని దేవుడు చాటుతాడు ఉనికి
ఉన్నానని తెలిపేందుకు ఉరటగా మనకి

Sunday, 17 February 2008

రాతి బతుకు

ఘనత లేదే చరితకైనా రాతి రాతలు లేకపోతే?
వెలతి కాదా కళలకైనా ఉలికి శిల బలి కాకపోతే?
రాయి రాయి రాసుకుంటే నిప్పు రవ్వలు పుట్టలేదా?
నిప్పునెరిగిన నరుడు నాడే నాగరికుడవ్వలేదా?
గొడ్డలైనా,బల్లెమైనా గుండె బలమీ రాయి కాదా?
వేట కొడవలి వాడినా,నాటు నాగలి పట్టినా
ఆదివాసికి అండగా ఈ బండ,కొండ ఉండలేదా?
మనేది కాదే మానవ జాతి పునాది కానిదే అనాది రాయి
మనసనేది లేదే మన రచనలకి, పాపం రాయి పరాయి!!

విశ్వరూపం

కనుల కలముకు కవనమొస్తే
తమ కదలికలు కవిత రాస్తే
కళలు ఒదిగిన కలల లిపిలో
నవ మధుర సాహితీ సౌరభాలు
ఘన తెనుగు తేనెల సాగరాలు
కలగలిపి నిలిపిన కలువ పువ్వుకు
వన్నెలు గొలిపే వెన్నెల వోలె
నవ కవిని నేనై కవి కులంలో
భువిని విరివిగా విస్తరిస్తాను

హేమంతపు హిమిక నేనై నింగి గప్పి
వసంతాన వాసంతమై గొంతు విప్పి
రెల్లు ఒడిలో చల్లగా చిరుజల్లు నేనై మురిసి
ఆకసమ్మును అల్లగా హరివిల్లు నేనై మెరిసి
ప్రకృతిలో తన ప్రతి కృతిలో నే భాగమౌతాను
ప్రతీక నేనై ప్రపంచ నాడికి పాటగా పల్లవిస్తాను