Sunday, 9 March 2008

నా కథ

పిచ్చి వాడంటారే ఒకరు,వెర్రి వాడంటు వేరొకరు
కానీ ఆ వాన మనసుకెరుకే ఈ పుడమి తల్లి వేదనలు
నువ్వు దూరం కాదు నాకు,నేను దూరం కాదు నీకు
అన్నది ఎరుక నా ఎదకు,ఎరుకే కూడా అది నీ ఎదకు

ప్రేమ మన మనసరాగాలే ధ్వనించే పావనమైన కథ
కబీరు కవి,మీరా బాయి ఒకపుడు పిచ్చివారే కదా?
జనం అన్నారు కన్నుల్లో కన్నీరున్నాయనే సత్యం
నువ్ గహిస్తే అదే ముత్యం,లేక నీరేగా అనునిత్యం

యోగి ఎదలో ఉప్పెనున్నా ఏడుపై రాదు ఎప్పటికీ
ఈ అశృకణం ప్రేమ ముత్యం, వీడనేలేను ఎన్నటికీ
నాకు సొంతం చేసి కూడా తిరిగి అడిగావు నీ మనసు
నాది కాలేని ఏ మనసు,నీది కానే కాదని తెలుసు

తుమ్మెదే కలువ పువ్వు పైన వాలితే ఓ అలఝడి మొదలు
కమ్మని కల మన మనసుల్లో కలిగితే ఓ అలఝడి మొదలు
ఇంత వరకీ జనం అంతా వింతగా విన్నారీ కథను
ఈ కథే యదార్థ గాధ అని తెలుపగా ఓ అలఝడి మొదలు

Friday, 7 March 2008

నే కోరే మరో ప్రపంచం


నవ్వుతూ నయవంచన చేసే నాగరిక సమాజ నైజం

బంధం , బాంధవ్యం ఎరుగని రాబందుల సందోహం

ఎటు చూసిన కుట్ర, కుతంత్రం, కసి, క్రోధం

కామం, కాఠిన్యం, కుళ్ళు తో కుళ్ళిన నర సమస్తం

ఎప్పుడు, ఇంకెప్పుడు కను విప్పును ఆ విధాత

ఎప్పుడు మారేను చెడిన వింత విశ్వ రాత??

నలు దిక్కుల దరిద్ర దేవత నాట్యమాడుతుంటే,

ఆకలి అక్రంధనలతో జనం అలమటిస్తుంటే,

అడుగడుగున అన్యాయం ప్రజ్వలిల్లుతుంటే,

ఆ అగ్ని శిఖలలో న్యాయం మండి పోతు ఉంటే...

గుండె పగిలి గర్జించిన ఆవేదన గీయమిది !

రక్త సిరతో రాస్తున్న ఆవేశపు రచన ఇది !!

ఆధిపత్యం పోరులో హింసలే చెలరేగుతుంటే ,

అణువూ,అణువూ అందుకై యుద్ధభూమిగా మారుతుంటే,

శాంతి, ధర్మం ఉసురు విడిచి ఉనికినే కోల్పోతూ ఉంటే,

కిరాచకుల అరచకాలే విలయ తాన్డవమాడుతుంటే...

ఉడికిన ఉద్రేకంలో గళం దాటిన భావమే ఇది !

ఉప్పొంగిన ఉద్వేగమే ఊపిరైన సాహిత్యమిది !!

చేయి కలిపి చివరి వరకు చెంత నడిచే యువత ఉంటే,

సంకల్పమొకటై సిద్ధాంతమునకై నిలబడే సామర్ధ్యమున్టే,

పురించనా విప్లవ శంఖం,మర్చేయన ప్రపంచ గమనం??

సృష్టించన సంచలనం,కనుచూడన నవ సమాజ నిర్మాణం??

అవినీతిని ఉక్కుపాదం తో తొక్కి వేసే తాహతుంటే

అక్రమాలను రూపుమాపే అధికారమే నా చేతికొస్తే

సృష్టికే ప్రతి సృష్టి చేసి శాంతికూపిరి పోయనా???

ఆకలెరుగని అన్నపూర్ణావనినే నిర్మించనా??

యువ ప్రపంచమ్, యువప్రపంచం చేతికి కళ్ళెం వస్తే ,

ఉరుకులేయద నవ సమాజ రథం, విజయ పథం వైపు?

కదం తొక్కి కదన రంగాన చెడును చిత్తు చేస్తూ ...

విజయభేరి మ్రోగించగా ...

వశమవ్వద నే కోరే మరో ప్రపంచం ??

వశమవ్వద నే కోరే మరో ప్రపంచం ??

Wednesday, 5 March 2008

తొలివలపు తలపులు

నీ పెదవి పై దరహాసాలు మరో మనసు దరఖాస్తై దారి వెతుకుతున్నాయి.
నా కోసం అని జపించిన నయనాలు నేడు తన కోసం అని తపిస్తున్నాయి.
అనుక్షణం ఆలోచనలే అస్త్రాలై సంధిస్తున్నాయి
అణువణువూ ఆ కలలే వస్త్రాలై స్పృశిస్తున్నాయి.
సందేహం తీరేవరకు సంరంభం తప్పదనీ,
సంకోచం వీడేవరకూ సంతోషం దక్కదనీ,
యద గదిలో ఊహల ఊయల ఊగుతూ...
మది నదిలో ఊసుల నావలా సాగుతూ...
నీకు కూడా తెలియని నిగూఢమే నువ్వని చూపెడుతూ...
నీడ కూడా నీ తోడని,నీ వాడని, నిను భ్రమ పెడుతూ...
మొదలౌతాయి ఆ "పరిణయ" తీరానికి నీ ప్రయాణాలు !!
మెదులుతాయి మదిలో తొలివలపు చేయు ప్రమాణాలు !!

Tuesday, 4 March 2008

నా తెలుగు పదం


కలం సారథై పద పదమని కదిలెను పద కదనానికి నా భావ రథం

ప్రతి తెలుగు పదం తను భాను బహువై చూపగా వెలుగు పథం

నుడికారమే నుదుట కుంకుమై,ఉపమానమే మాన సమానమై

పదజాలమే పట్టు చీరగా, అన్త్యప్రాసయే తన అలంకరామవగా

తెలుగుదనం తొణికిసలాడే "పదతరుణి" వంటి నా కవితలకు...

ఆరంభం,అంతం,ఆనందం,అందం అంతా అక్షర బంధంలోనే !

ఆకలి,ఆట,పాట అంతా అచ్చ తెనుగు అక్షర బృందంతోనే !!

పరభాషల ప్రభావాలు, పాశ్చాత్యపు పిశాచాలు

అంతటినీ అంతు చేయ ఆయుధమే నా తెలుగు పదం !!

పచ్చని పల్లెల శ్వాసలో,పలికే ప్రతి తెలుగోడి నాడిలో

వెచ్చగా వినిపించే పాటల స్వరమూలం నా తెలుగు పదం !!

చీకటి కమ్మిన జామున,చెల్ల గాలి వేళలోన చిటికెలతో తట్టి లేపి

లయను కూర్చి, లౌక్యం చెప్పే జానపదం నా తెలుగు పదం !!

అకారం తో, అచ్చుగా శ్రీకారమెత్తిన జాణ పదం

అమ్మకే ఆకారమౌ ఈ పదం నా జనని సమం !!

Monday, 3 March 2008

దైవపదం

నారుపోసే నిరు పేద రైతు కన్నీరులో కొలువుంటాను.
రాతి పని చేసే ముదసలి తాత చాతి పై తీర్థమౌతాను.
ఆకలితో రగిలే పేగుల తీగల రాగంలో వినబడతాను.
మట్టి కొట్టిన వాని మేనిపై జారు చెమట నై ఉంటాను.
పసిడి పసి పాప మనసులో బస చేసి బాసిల్లుతాను.
తన బోసి నవ్వులే వేద బాసగా మురిసి పలుకుతాను.