Tuesday, 31 May 2016

Veenaa Vedika's MANASU bags the BEST SHORT FILM AWARD in NATA Convention 2016, Dallas


VeenaaVedika's Manasu bags the BEST SHORT FILM in NATA Convention, Dalla-2016

NATA- North American Telugu Association, Dallas నిర్వహించిన లఘు చిత్రోత్సవం లో మన వీణా వేదిక వారి మనసు అత్యుత్తమ లఘుచిత్రంగా నిలిచింది. విజయానంద శిఖరాగ్రములో మన యావత్ వీణా వేదిక బృందం విరాజిల్లుతోంది.ఈ విజయాన్ని సుసాధ్యం చేయడంలో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ వీణా వేదిక కృతజ్ఞతాభివందాలు!!


నాణ్యత లోపించని కార్యశీలత,హృదయాలను స్పృశించే కథాకథన శైలి, సినిమా స్థాయికి  యే మాత్రం తీసిపోని సాంకేతిక ప్రమాణాలు, సామాజిక బాధ్యతే శ్వాస గా బ్రతికే కళాసంస్కృతి, లక్ష్య సాధనలో రాజీ పడక కృషించే స్ఫూర్తి వీణా వేదికకి ఉన్న శక్తి సామర్ధ్యాలు, గుణ గణాలు, జన్మతహ సిద్ధించిన సహజ లక్షణాలు!!

ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలను మన తెలుగు భాషలో రూపొందించే భారీ బాధ్యతని ఇష్టపూర్వకంగా తమ భుజస్కంధాల మీదకు స్వాగతించి స్వీకరించి కళాభారతికి హారతులిచ్చే ప్రయత్నం చేస్తుందని వీణా వేదిక ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తోంది!!

ఇట్లు
శ్రీరామ్ సాంజి 

Thursday, 26 May 2016

జీవానికి జీవం పోసే చోటు


గోడలు,గొడవలూ చుట్టూ లేని చోటకి వెళ్ళు
గడియారం గుర్తుకు రాని, గాలి కౌగిల్లోకెళ్ళు
అద్దాలు,ఆఫీసు,బల్లలు,బిల్లుల గోల లేని ఖాళీ జాగాకెళ్ళు
మొబైల్ మోయకుండా,మ్యాప్స్ వాడకుండా మనసు కోరే చోటకెళ్ళు
టీవీ సోదికి,మూవీ బాధకి దొరకనంత దూరం వెళ్ళు
ఆటోల నాటు సౌండ్లు,ఆంబులెన్స్ ఆర్థనాధాలకావలికెళ్ళు 
ఏడాసనం లో ఏడ్చిన కాళ్ళని,ఒకటాకారం లోకీడ్చి నడిచెళ్ళు
కళ్ళకి రేబాన్ చీరలు కట్టక,సహజ కాంతులతో కడిగేసి వెళ్ళు
చిమ్నీ దగ్గులతో పొగల చున్నీ కప్పుకున్న నింగినొదిలి వెళ్ళు   
ప్లాస్టిక్ చెంబుల నీటిని వదిలి పారే జలాలున్న పల్లెలకెళ్ళు
జీవితం నుండి జీవాన్ని కాజేసిన జనారణ్యాన్ని వదిలేసి వెళ్ళు 
నిన్ను నీకు లేకుండా చేసిన నిన్నను తల పై తన్నేసి వెళ్ళు
నీక్కావల్సిన రేపు వైపు,నీది కాని నేటిని నిట్టుర్పులో విడిచెళ్ళు
పట్నం లో బ్రతికానని భ్రాంతి పడిన దేహానికి
చితిని పేర్చి,చిచ్చు పెట్టి అదిగో అటు వైపెళ్ళు
  
ఏకాంతం ఆసాంతం ఎంత శాంతమో అర్థమౌతుంది 
మౌనం తో ముచ్చటించే అవకాశమొకటి వస్తుంది 
ఆత్మశోధనకి ఆత్మ సంభాషణ కి ఆస్కారముంటుంది 
నీతో నువ్వు గడిపే క్షణాల మూల్యమెంతో తెలుస్తుంది

ఆ క్షణం లో...

ఆరంభం ఎపుడో తెలియని, ఆగక వెలుగిచ్చే రవిని,
భారం ఎంతేస్తూ ఉన్నా...నోర్మెదపని తల్లి నేలని,
కాలుష్యం కత్తులతో కోట్ల పోట్లు పొడుస్తూ ఉన్నా...
నవ్వుతూ,నమ్ముతూ ఆయువిచ్చే  ఆ వాయువుని,
చెట్లని నరికేస్తూ ఉన్నా,ఛీ పొమ్మని కసిరేస్తున్నా...
ఏం బంధమో మనతో తనకి,దప్పిక తీర్చే ఆ నీటిని,
ఒక్క సారి కన్నీరు రాల్చి నీ ఋణమెంతుందో అడగు
ఎన్ని జన్మలైతే ఆ ఋణాన్ని తీర్చగలవని అడుగు !!

ఎంత చేసినా,ఇంత ఇచ్చినా అహం లేదు,అలసట లేదు
ఇవ్వడం లో ఉన్న ఆనందమేమిటో గుర్తు చేసే చోటకెళ్ళు
మంచిని పంచే కొలది,ఆ పంచే శక్తి మరింత పెరుగుతుంది
నిస్వార్థానికి అర్థమేంటో అర నిమిషముంటే తెలిసే చోటకెళ్ళు
నాదంటూ ఏదీ లేదని,నలుగురి కోసమే ఈ నాలుగు రోజులని
జీవిత సారాన్ని నేరుగా నీ శ్వాసల్లోకూదే గాలి వీచే చోటకెళ్ళు 

-శ్రీరామ్ సాంజి



విశ్వ ప్రేమ

సుమమంటే సూర్యుడికెక్కువా??ప్రతి పూటా పలకరిస్తాడు.
వసంతం కోయిల సొంతమా??ప్రతి వత్సరం వస్తూనే ఉంది.
వెన్నెల ప్రతి నెలకీ ప్రియమా??అడగకనే అడుగిడుతుంది.

ఔను.ప్రకృతంతా ప్రేమ మయం
ప్రేమున్న చోట సాంగత్యం సహజం!

మరి నా మనసంటే ప్రేమకి ఇష్టమెందుకు లేదు??
సృష్టినంతా సమానంగా చూడగలిగే ప్రేమ నాలో ఎందుకు లేదు??
హ్మ్  
తల్లికో ఆలికో,తమ్ముడికో అక్కకో
తాకట్టు పెట్టిన జీవితం కదా?
వెలకట్ట లేని ప్రేమ వాసమెలా ఉంటుంది??

స్వార్థమనే దుర్గంధం తో
భ్రష్టు పట్టిన మనసు కదా?
నిర్మలమైన ప్రేమ నాలో ఎలా ఉంటుంది??

నా వారు కాని నలుగురిని ప్రేమించే ప్రేమ,
నా అని ఎవరూ లేనివారికి నేనిచ్చే ప్రేమ,
'నేను 'అన్న భావాన్ని వధించే ప్రేమ,
నేడు,రేపూ నిత్యం నిలిచిపోయే ప్రేమ ,
నాకు ప్రసాదంగా ఇవ్వు దేవుడా..!!

-శ్రీరామ్ సాంజి

కురవవే వాన...కురువు

కురవవే వాన...కురువు

మేఘాల గర్భం చీల్చుకుని,మెరుపు పేగుని తెంచుకుని
ఢమ ఢమ ధ్వనులే తొలిపలుకులుగా...
కురవవే వాన...కురువు.

పుడమి ఒడలు పై పాపుల పాదాలేసిన అడుగులు చెరిగేవరకు
ఆ ధూళి పొరలు నీ జల ధారల్లో కొట్టుకు పోయేవరకు...
కురవవే వాన...కురువు.

మేఘాలయం లో వాన దేవతై,మా ఘాడ పూజల తీయని ఫలమై
నిగూఢ రూపము మరిపించేలా,మా గూడు చేరి మము మురిపించేలా...
కురవవే వాన...కురువు

వేడుకున్నా శరణు శరణని,వేడికన్నేసి కరుణ కనబరచని
అరుణ నయనాల ఆదిత్యుడి అహానికి,వరుణ ధాటితో చినుకు చినుకున  వణుకు పుట్టేలా
కురవవే వాన...కురువు

జలకాంతులు ప్రసరించే దీపం మెట్టినిల్లైన మహిలో పెట్టాలని
నిలదీసి అడిగి,నీ పుట్టినిల్లైన ఆ నింగి గడప దాటేసి వచ్చి
కురవవే వాన...కురువు.

కరువను కౌరవ దుశ్శాసనుడే ధాత్రి దౌపదిని చెరబడుతుంటే
హరి గా మారి హరిత చీరలతో అవని మానాన్ని రక్షించేలా
కురవవే వాన...కురువు.

దాహం తీరని ధరణి గళం లో దోసెడు ద్రవమేదో పోసి
దూడకు పాలిచ్చేసి ఆవిరై తిరిగొస్తానని పులి-మేఘం తో పలికిన ఆవులాగ
కురవవే వాన...కురువు.

నా పాటలోని ప్రతి అక్షరం లో ఆవేదనన్నది ప్రత్యక్షమైతే
ఆ సాహిత్యానికి,సరస్వతికి ఓ స్రోతస్విని లా,సుధ స్రవంతి లా శుభమంటూ గానం చేస్తూ
కురవవే వాన...కురువు.

-శ్రీరామ్ సాంజి

Sunday, 22 May 2016

MANASU (మనసు)- a SHORT FILM by Veenaa Vedika

వీణా వేదిక వారి మనసు preview చూసే అవకాశం నాకు ఇటీవలె కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరహ subject పైన ఇంత తక్కువ వ్యవధిలో ఇంత సమర్థవంతంగా అనుకున్నది అనుకున్నట్టు చూపించగలిగేలా ఒక లఘుచిత్రం రావడం నిజంగా ఒక మంచి మార్పు. ఈ లఘుచిత్రం గురించి నాలుగు మాటలు తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత నాకుందనిపించింది.   

పుట్టిన ప్రతి మనిషికీ ఆ తర్వాత పుట్టుక లాగా ఖచ్చితమైన, అనివార్యమైన దశ ఏదైనా ఉంది అంటే అది కేవలం మరణమే. ఇది నిజం. జీవితం జనన మరణాలు అనే ఈ రెండు నిజాల నడుమ సాగే ఒక విచిత్ర నాటకం.బాల్యం, చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం వగైరాలతో వేగంగా సాగిపోయే తొలి సగం కాసేపాగి ఆలోచించేందుకు, అవలోకించేందుకు, అన్వేషించేందుకు ఎక్కువగా తావు ఇవ్వదు.ఒంటరిగా ఈ భూమిపైకొచ్చిన మనం తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోవాలన్న చింతన మొదలయ్యేది రెండో సగంలోనే. ఈ తరహా చింతనావలయం లో చిక్కి మనసునే నీడగా, నేస్తంగా కలిగిన ఓ పెద్దమనిషి లోనయ్యే ఆలోచనా సరళిని కేవలం 35నిమిషాల్లో హృదయాలకు హత్తుకొనే విధంగా అవగతమయ్యేలా తీర్చిదిద్దిన లఘుచిత్రం "MANASU". ఈ కారణం చేత ఈ చిత్రం చాలా అభినందనీయం. 

ఈ ప్రపంచం తో ఉన్న అన్ని బంధాలను చావు ద్వారా కోల్పోవడం అనే విషయం, ఆ దశలో ఉండి అలాంటి క్షణాలని గడుపుతున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసినదే. ఆ కోవకి చెందిన వారి గుండెలని ఈ లఘుచిత్రం నేరుగా తాకుతుంది.ఇదిగో ఇది నీ కథే కదా అని అడగకనే అడుగుతుంది. చెప్పకనే చెబుతుంది. మరణించాక కూడా జీవించి ఉండాలంటే, జీవించి ఉండగానే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే సూక్ష్మాన్ని సున్నితమైన, సరళమైన శైలిలో ఈ చిత్రం లో తెరకెక్కించే ప్రయత్నం దర్శకులు చేశారని గమనించగలను.జీవిత పరమార్థాన్ని జీర్ణమయ్యే రీతిలో చెబుతూ, బంధాలకు ఎంత వరకు బందీగా ఉండాలో చిత్రం లోని ముఖ్య పాత్ర రూపేణ ప్రేక్షకలోకానికి చెప్పే ప్రయత్నం చేశారు.   

Title Song
"చివరికెవరు ఎవరికి సేరువ? సీకట్లో సేరిపోదా ఎలుగుల ఏకువ?" 
అంటూ పదునైన ప్రశ్నని సూటిగా వేస్తూ మొదలయ్యే Title song, చిత్ర సారాంశాన్ని పరిచయం చేస్తుంది.  

"మూణ్ణాళ్ళు ఉన్నా కూడా మల్లెల ఎల్లువ, సక్కంగ సాటుకోదా ఉనికికి ఇలువ? అంటూ ఎన్నాళ్ళు బ్రతికాం అనేది కాదు, ఎంత అర్థవంతంగా బ్రతికాం అన్నది ముఖ్యమని జీవనదిశానిర్దేశం అనే అంశాన్ని ప్రస్తావిస్తుంది.  

"కంచికి చేరని కథేది మానవ? పోతేనేం పాత నీరు కొత్త నీరు చేరదా? కళ్ళ ముందు నిజాన్ని చూడవా? మనసు చేతిలో కీలుబొమ్మవా?"

అన్న మాటలు జీవితం లో ఎవరికీ కూడా ఇంకొకరితో బంధం అనేది శాశ్వతం కాదు. బంధాల ఊబిలో చిక్కుకొని లేని వాటి కొరకు ప్రాకులాడక, సత్యాలను తెలుసుకొని మనకంటూ ఉన్న పరిమిత జీవిత కాలాన్ని, మనదైన పరిధిలో అర్థవంతంగా పరిపూర్ణంగా గడపాలని గుర్తు చేస్తాయి. చేదు నిజాలను గ్రహించాలని, బాధాకరమైన పరిస్థితులని కూడా ఎదురుకోవాలని హెచ్చరిస్తాయి. 

మానవ సంబంధాలు, జీవిత పరమార్థం, మనుష్య జన్మకి సాఫల్యం లాంటి పార్శ్వాలను అందమైన విధంగా ఆవిష్కరించిన చిత్రంగా ఈ లఘుచిత్రం ఓ ప్రత్యేకత సంపాదించుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఈ లఘుచిత్రం విమర్శుకల మన్ననలు పొందాలని, ప్రేక్షకుల మనసులో తమ మనసుకి దర్పణం గా నిలిచిపోవాలని ఆశిసూ యావత్ చిత్ర బృందానికి నా శుభాభినందనలు!! 

ఇట్లు
శ్రీరామ్ సాంజి