Thursday, 26 May 2016

జీవానికి జీవం పోసే చోటు


గోడలు,గొడవలూ చుట్టూ లేని చోటకి వెళ్ళు
గడియారం గుర్తుకు రాని, గాలి కౌగిల్లోకెళ్ళు
అద్దాలు,ఆఫీసు,బల్లలు,బిల్లుల గోల లేని ఖాళీ జాగాకెళ్ళు
మొబైల్ మోయకుండా,మ్యాప్స్ వాడకుండా మనసు కోరే చోటకెళ్ళు
టీవీ సోదికి,మూవీ బాధకి దొరకనంత దూరం వెళ్ళు
ఆటోల నాటు సౌండ్లు,ఆంబులెన్స్ ఆర్థనాధాలకావలికెళ్ళు 
ఏడాసనం లో ఏడ్చిన కాళ్ళని,ఒకటాకారం లోకీడ్చి నడిచెళ్ళు
కళ్ళకి రేబాన్ చీరలు కట్టక,సహజ కాంతులతో కడిగేసి వెళ్ళు
చిమ్నీ దగ్గులతో పొగల చున్నీ కప్పుకున్న నింగినొదిలి వెళ్ళు   
ప్లాస్టిక్ చెంబుల నీటిని వదిలి పారే జలాలున్న పల్లెలకెళ్ళు
జీవితం నుండి జీవాన్ని కాజేసిన జనారణ్యాన్ని వదిలేసి వెళ్ళు 
నిన్ను నీకు లేకుండా చేసిన నిన్నను తల పై తన్నేసి వెళ్ళు
నీక్కావల్సిన రేపు వైపు,నీది కాని నేటిని నిట్టుర్పులో విడిచెళ్ళు
పట్నం లో బ్రతికానని భ్రాంతి పడిన దేహానికి
చితిని పేర్చి,చిచ్చు పెట్టి అదిగో అటు వైపెళ్ళు
  
ఏకాంతం ఆసాంతం ఎంత శాంతమో అర్థమౌతుంది 
మౌనం తో ముచ్చటించే అవకాశమొకటి వస్తుంది 
ఆత్మశోధనకి ఆత్మ సంభాషణ కి ఆస్కారముంటుంది 
నీతో నువ్వు గడిపే క్షణాల మూల్యమెంతో తెలుస్తుంది

ఆ క్షణం లో...

ఆరంభం ఎపుడో తెలియని, ఆగక వెలుగిచ్చే రవిని,
భారం ఎంతేస్తూ ఉన్నా...నోర్మెదపని తల్లి నేలని,
కాలుష్యం కత్తులతో కోట్ల పోట్లు పొడుస్తూ ఉన్నా...
నవ్వుతూ,నమ్ముతూ ఆయువిచ్చే  ఆ వాయువుని,
చెట్లని నరికేస్తూ ఉన్నా,ఛీ పొమ్మని కసిరేస్తున్నా...
ఏం బంధమో మనతో తనకి,దప్పిక తీర్చే ఆ నీటిని,
ఒక్క సారి కన్నీరు రాల్చి నీ ఋణమెంతుందో అడగు
ఎన్ని జన్మలైతే ఆ ఋణాన్ని తీర్చగలవని అడుగు !!

ఎంత చేసినా,ఇంత ఇచ్చినా అహం లేదు,అలసట లేదు
ఇవ్వడం లో ఉన్న ఆనందమేమిటో గుర్తు చేసే చోటకెళ్ళు
మంచిని పంచే కొలది,ఆ పంచే శక్తి మరింత పెరుగుతుంది
నిస్వార్థానికి అర్థమేంటో అర నిమిషముంటే తెలిసే చోటకెళ్ళు
నాదంటూ ఏదీ లేదని,నలుగురి కోసమే ఈ నాలుగు రోజులని
జీవిత సారాన్ని నేరుగా నీ శ్వాసల్లోకూదే గాలి వీచే చోటకెళ్ళు 

-శ్రీరామ్ సాంజి



No comments: