సుమమంటే సూర్యుడికెక్కువా??ప్రతి పూటా పలకరిస్తాడు.
వసంతం కోయిల సొంతమా??ప్రతి వత్సరం వస్తూనే ఉంది.
వెన్నెల ప్రతి నెలకీ ప్రియమా??అడగకనే అడుగిడుతుంది.
ఔను.ప్రకృతంతా ప్రేమ మయం
ప్రేమున్న చోట సాంగత్యం సహజం!
మరి నా మనసంటే ప్రేమకి ఇష్టమెందుకు లేదు??
సృష్టినంతా సమానంగా చూడగలిగే ప్రేమ నాలో ఎందుకు లేదు??
హ్మ్
తల్లికో ఆలికో,తమ్ముడికో అక్కకో
తాకట్టు పెట్టిన జీవితం కదా?
వెలకట్ట లేని ప్రేమ వాసమెలా ఉంటుంది??
స్వార్థమనే దుర్గంధం తో
భ్రష్టు పట్టిన మనసు కదా?
నిర్మలమైన ప్రేమ నాలో ఎలా ఉంటుంది??
నా వారు కాని నలుగురిని ప్రేమించే ప్రేమ,
నా అని ఎవరూ లేనివారికి నేనిచ్చే ప్రేమ,
'నేను 'అన్న భావాన్ని వధించే ప్రేమ,
నేడు,రేపూ నిత్యం నిలిచిపోయే ప్రేమ ,
నాకు ప్రసాదంగా ఇవ్వు దేవుడా..!!
-శ్రీరామ్ సాంజి
No comments:
Post a Comment